Chandrababu Amit Shah Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకస్మిక ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాలతో పాటు జాతీయ స్థాయిలో తీవ్ర ఆసక్తిని,
ఉత్కంఠను రేకెత్తిస్తోంది. బుధవారం ఉదయమే హస్తినకు బయలుదేరనున్న సీఎం, తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో కీలక భేటీలు కానున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలతో కేంద్రం పలు కీలకమైన బిల్లులను ప్రవేశపెడుతున్న తరుణంలో, ఎన్డీయే కూటమిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రధాన భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏపీ అంశాలపై కీలక చర్చలు
ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక సాయం, పెండింగ్ నిధుల విడుదలపై సీఎం చంద్రబాబు కేంద్ర పెద్దలతో చర్చించనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి అందుతున్న రుణాల ప్రక్రియ వేగవంతం, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఖరారు , నిధుల రీయింబర్స్‌మెంట్‌పై ఆర్థిక మంత్రితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న వివిధ రైల్వే, రహదారి ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ నుంచి లభించాల్సిన కేటాయింపులపై స్పష్టత తీసుకోనున్నారు.
రాజ్యాంగ సవరణ బిల్లలుపై కార్యాచరణ
మరోవైపు రాజకీయ కోణంలోనూ ఈ పర్యటన అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న వ్యూహాత్మక బిల్లులకు టీడీపీ పూర్తి స్థాయి మద్దతు అందించే విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రాజకీయ సమీకరణలపై చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో అంతర్గత సమన్వయం, ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల దిశగా కూటమి వ్యూహాలు మరియు నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలపై కూడా కేంద్ర పెద్దలకు నివేదించనున్నారని ప్రచారం జరుగుతోంది.
బిజినెస్ సమ్మిట్ లో పాల్గొననున్న చంద్రబాబు
ఢిల్లీలో పలువురు పారిశ్రామికవేత్తలు, బిజినెస్ సమ్మిట్ ప్రతినిధులతో కూడా సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యే షెడ్యూల్ ఉంది. అమరావతిలో నిర్మించతలపెట్టిన గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, ఐటీ హబ్‌లలో పెట్టుబడులు పెట్టేలా ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలకు ఏపీ పారిశ్రామిక విధానాన్ని వివరించనున్నారు. ఏపీ వేగవంతమైన పునర్నిర్మాణానికి ఈ పెట్టుబడులు కీలకమని భావిస్తున్న సీఎం, కేంద్ర సహకారంతో మరిన్ని పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
జాతీయ పార్టీల నేతలతో కీలక చర్చలు
పార్లమెంట్ బిల్లుల గందరగోళం, రాష్ట్ర ప్రాజెక్టుల నిధుల సాధన , రాజకీయ సమీకరణల నడుమ చంద్రబాబు నాయుడి ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయ చిత్రాన్ని మార్చే విధంగా ఉండబోతోందని భావిస్తున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం నిధుల విడుదలపై ఢిల్లీ నుంచి ఎలాంటి హామీ లభిస్తుందనే అంశంపై రాష్ట్ర శ్రేణులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.














