భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram Airport) ప్రారంభోత్సవానికి
ముహూర్తం ఖరారైంది. ఇటీవల ఎయిర్ పోర్ట్ నిర్మాణ చివరి దశ పనులు సైతం పూర్తయ్యాయి. ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం జరగనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం నాడు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ఆగస్టు ఒకటో తేదీ.. ఉత్తరాంధ్ర.. ఉత్తమాంధ్రగా నిలిచేందుకు ముహూర్తం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఓ ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం అవుతున్న సమయంలో.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా తమ మద్దతును అందివ్వాలని రామ్మోహన్ నాయుడు కోరారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్, వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు.
చరిత్రలో నిలిచిపోయేలా భోగాపురం ఎయిర్ పోర్ట్ వేడుక..
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ వేడుక చరిత్రలో నిలిచిపోయేలా అత్యంత ఘనంగా జరిగేలా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్ట్ పనుల పురోగతి, ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక మణిహారం లాంటిది. ఇది ఈ ప్రాంతానికి సరికొత్త ఆర్థిక, పారిశ్రామిక అవకాశాలను తీసుకువస్తుంది. భోగాపురం విమానాశ్రయం, పర్యాటక ప్రాజెక్టులు, పోర్టులు, జాతీయ రహదారులు, పరిశ్రమల అనుసంధానంతో ఉత్తరాంధ్ర ఇకపై అన్స్టాపబుల్ గా దూసుకుపోతుందని దీమా వ్యక్తం చేశారు. ఈ ఎయిర్ పోర్ట్ లోని ప్రతి విభాగం ఏపీ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.















