Air Traffic Control Vijayawada: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ముఖద్వారమైన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం మౌలిక సదుపాయాల కల్పనలో సరికొత్త మైలురాయిని అధిగమించింది.
విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన అత్యాధునిక ఏటీసీ టవర్-కమ్-టెక్నికల్ బ్లాక్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శనివారం అధికారికంగా ప్రారంభించారు. విమాన రాకపోకల నిర్వహణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, పెరుగుతున్న కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసింది. అన్ని రకాల చట్టబద్ధమైన, కార్యాచరణ, నియంత్రణ అనుమతులు సాధించిన ఈ సదుపాయాన్ని కేంద్రమంత్రితో పాటు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ , మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సరికొత్త ఏటీసీ టవర్ , టెక్నికల్ బ్లాక్ ప్రారంభంతో విజయవాడ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ ప్రమాణాల భద్రతను సంతరించుకుంది. ఈ సదుపాయం ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ తో పాటు కమ్యూనికేషన్, నావిగేషన్, సర్వైలెన్స్ విధులను అత్యంత సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన అధునాతన కార్యాచరణ వ్యవస్థలతో డిజైన్ చేశారు. వివిధ సాంకేతిక సేవల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం ద్వారా పైలట్లకు, విమానయాన సంస్థలకు సురక్షితమైన, వేగవంతమైన సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. భవిష్యత్తులో ప్రయాణీకుల రద్దీ , విమానాల సర్వీసులు భారీగా పెరిగినా తట్టుకునేలా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
విమానాశ్రయంలో శరవేగంగా నిర్మాణమవుతున్న నూతన టెర్మినల్ భవన పనులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కేశినేని చిన్ని నేరుగా కార్మికులు, ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. నిర్మాణ పురోగతిపై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి, పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. రాబోయే దసరా పండుగ నాటికల్లా ఈ నూతన టెర్మినల్ భవనాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను కోరినట్లు ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే అమరావతి ప్రాంత గ్లోబల్ కనెక్టివిటీ రూపురేఖలు మారిపోనున్నాయి.
కేంద్ర, రాష్ట్రాల్లో డబల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఎయిర్పోర్ట్ అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎంపీ చెప్పారు. కేవలం ఏటీసీ సెంటర్ ప్రారంభించడమే కాకుండా, ఈ నెల 25వ తేదీ నుండి అంతర్జాతీయ విమాన సర్వీసుల అనుసంధానాన్ని మరింత పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఢిల్లీ, హైదరాబాద్, మద్రాస్, బెంగళూరు నగరాలకు విమాన సర్వీసులు పెంచడమే కాకుండా, ముంబైకి ప్రతిరోజూ రెండు ఫ్లైట్లు నడిచేలా ఏర్పాట్లు చేశామన్నారు. రాబోయే ఆగస్టు 13 నుండి ఆధ్యాత్మిక నగరం వారణాసి , కోల్‌కతాకు సైతం కొత్త సర్వీసులు ప్రారంభం కావడం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ప్రజలకు ఎంతో ఆనందకరమైన విషయమన్నారు.
శబరిమలై వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం విజయవాడ నుండి కొచ్చిన్‌కు నేరుగా విమాన సర్వీస్ నడపాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని ఎంపీ కోరారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ కార్గో హబ్‌గా, ప్రయాణీకులకు అత్యుత్తమ సేవలందించే కేంద్రంగా మార్చడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు.













