ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ అనంతరం అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్ల మధ్య గొడవ జరిగింది. ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్రంగా కొట్టుకున్నారు. ఒకరిపైఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.
దాంతో అక్కడ ఘర్షణవాతావరణం కనిపించింది. మ్యాచ్ అధికారులు జోక్యం చేసుకొని ఆటగాళ్లను అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో స్పెయిన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సోమవారం అర్ధరాత్రి ఉత్కంఠగా సాగిన ఫైనల్లో స్పెయిన్ 1-0తో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను ఓడించింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో మ్యాచ్ నిర్ణీత సమయంలో ఫలితం తేలలేదు. దాంతో ఎక్స్ట్రా టైమ్ ఆడించాల్సి వచ్చింది. ఈ సమయాన్ని స్పెయిన్ సద్వినియోగం చేసుకుంది.
106వ నిమిషంలో స్పెయిన్ ప్లేయర్ ఫెర్రాన్ టొర్రెస్ అద్వితీయమైన గోల్‌తో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ విజయంతో స్పెయిన్ రెండో ప్రపంచకప్‌ను ముద్దాడింది. 2010లో తొలి ప్రపంచకప్‌ను గెలుచుకున్న స్పెయిన్.. 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ విశ్వవిజేతగా నిలిచింది.
🚨 Gavi and Leandro Paredes clash after the final whistle of Spain vs Argentina.
- Sports on Predict (@sportsonpredict) July 19, 2026
pic.twitter.com/mU1H32Dyex
మైదానంలో కొట్టుకున్న ఆటగాళ్లు..
ఈ విజయానంతరం స్పెయిన్ ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా.. గొడవ మొదలైంది. అర్జెంటీనా ప్లేయర్ లియాండ్రో పరేడెస్ స్పెయిన్ ఆటగాడు గావిని తోసేసి ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. మరోప్లేయర్ అడ్డుకోవడానికి రాగా అతన్ని కూడా కొట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మైదానంలో కొట్టుకున్న ఆటగాళ్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచకప్ విజేతగా నిలిచిన స్పెయిన్‌కు రూ. 420 కోట్ల ప్రైజ్‌మనీ వరించింది. రన్నరప్ అర్జెంటీనాకు రూ.277 కోట్లు దక్కాయి. ఈ ప్రపంచకప్ విజయంతో సగర్వంగా ఆటకు వీడ్కోలు పలకాలని భావించిన అర్జెంటీనా కెప్టెన్, ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ చిరకాల స్వప్నానికి తెరపడింది.











